కులం,మతం లేదని సీటు ఇవ్వలేదు – డాక్టర్‌ సమరం

కులం,మతం లేదని సీటు ఇవ్వలేదు డాక్టర్‌ సమరం. జగమెరిగిన సెక్సాలజిస్టు:-

లేత కుర్రాడి నుంచి పండు ముసలిదాకా.. అందరి శృంగార సందేహాలు తీర్చే సన్నిహితుడు. చాలామందికి ఆయన గురించి తెలిసింది ఇంతే. తెలియాల్సింది చాలా ఉంది. మూడు దశాబ్దాలపాటు రెండ్రూపాయల ఫీజు తీసుకున్న పేదల వైద్యుడాయన… దాడులు జరిగినా వెరవక మూఢనమ్మకాలపై యుద్ధం చేస్తున్న సంఘ సేవకుడు… హేతువాది. ఎనభై ఏళ్ల వయసులోనూ రోజుకు పదహారు గంటలు పని చేసే ఆ నిత్య యవ్వనుడిని.. ‘హాయ్‌’ అంటూ పలకరిస్తే ఆయనలోని కోణాలెన్నో ఆవిష్కరించారు.

నాన్నను ఉద్యోగంలోంచి తీసేశారు
స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు (గోరా) మా నాన్న. పుట్టింది పరమ సనాతన కుటుంబంలో అయినా చిన్నప్పట్నుంచే వాస్తవిక దృక్పథంతో ఆలోచించేవారు. కులమత వ్యత్యాసాలు, హెచ్చుతగ్గుల్ని నిరసించేవారు. అధ్యాపకుడిగా పని చేస్తున్నప్పుడు ఒక పత్రికలో ‘దేవుడు లేడు’ అనే వ్యాసం రాశారు. దాంతో ఆయనను ఉద్యోగం నుంచి తీసేశారు. అయినా వెరవక నాస్తికత్వం వైపు దూకుడుగా వెళ్లారు. చిన్నప్పట్నుంచి ఆయన ప్రభావం మాపై బలంగా ఉంది.
రెండో ప్రపంచ యుద్ధమే నా పేరు
దేవుడు, కులం, మతం సూచించే ఏ పేర్లూ మాకు ఉండకూడదు అనుకున్నారు నాన్న. పెద్దక్కయ్యకి మనోరమ, ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న రోజుల్లో పుట్టిన అన్నయ్యకి లవణం, గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక జరిగినప్పుడు జన్మించిన అమ్మాయికి మైత్రి, చదువుపై మమకారంతో ఇంకో అక్కయ్యకి విద్య, గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ విజయం సాధించినప్పుడు పుట్టిన అక్కయ్యకి విజయ, రెండో ప్రపంచయుద్ధ సమయంలో పుట్టిన నాకు సమరం, హిట్లర్‌.. స్టాలిన్‌, ముస్సోలినీల ప్రేరణతో తమ్ముడికి నియంత, స్వాతంత్య్రం వచ్చేముందు పుట్టిన చెల్లికి మార్పు అని పేర్లు పెట్టారు.
ఈమధ్యే 10,292 మందితో ‘మేం రక్తదానం చేస్తాం’ అని సామూహిక ప్రతిజ్ఞ చేయించి గిన్నెస్‌ రికార్డు సృష్టించాం. ‘స్వేచ్ఛ ఐ బ్యాంక్‌’ ప్రారంభించి ఇప్పటివరకు 900 మందికి చూపు తెప్పించాం.
సమాజం నుంచి వెలి
నాన్న భావాలు ఎవరికీ నచ్చకపోవడంతో దాదాపు మమ్మల్ని సమాజం నుంచి వెలేశారు. కుటుంబం గడవడానికి చిన్న ప్రింటింగ్‌ ప్రెస్‌ నడిపేవాళ్లం. పిల్లలందరం అందులో పని చేసేవాళ్లం. మెట్రిక్యులేషన్‌ ప్రైవేటుగా రాస్తే ఫస్ట్‌ర్యాంక్‌ వచ్చింది. విజయవాడ లయోలా కాలేజీలో దరఖాస్తు చేస్తే నాకు కులం, మతం లేదని సీటు ఇవ్వలేదు. అప్పటి యూజీసీ ఛైర్మన్‌, విద్యాశాఖ మంత్రికి లేఖలు రాశాం. స్పీకర్‌ అయ్యదేవర కాళేశ్వరరావు చొరవ తీసుకున్నారు. ఈ విషయం అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది. ఇంత జరిగాక ఆలస్యంగా వచ్చానని అబద్ధం చెప్పి సీటు నిరాకరించారు. నేను వేరే కాలేజీలో చేరాను.
విదేశాలకు వెళ్తే ఎలా?
నా చిన్నప్పుడు వెంపటి సూర్యనారాయణ, కొమర్రాజు అచ్చమాంబ అనే డాక్టర్లు ఉండేవారు. వాళ్లు పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుండేవారు. ఆ ఇద్దరి స్ఫూర్తితో ఎలాగైనా వైద్యుడిగా సేవ చేయాలనుకున్నా. కాకినాడ రంగరాయ మెడికల్‌ కాలేజీలో చేరి మెడిసిన్‌ పూర్తి చేశాను. తర్వాత అమెరికా వెళ్లడానికి ఈసీఎఫ్‌ఎంజీకి బాగా ప్రిపేరయ్యాను. కానీ పరీక్ష రాసే సమయానికి లక్ష్యం గుర్తొచ్చింది. విదేశాలకు వెళ్తే పేదలకెలా సేవ చేయగలనని ఆగిపోయాను.  
రెండ్రూపాయలకు వైద్యం
1972లో విజయవాడ పటమటలో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. రెండు రూపాయలు ఫీజు తీసుకునేవాణ్ని. అదీ ఇంజెక్షన్‌, మందులతో కలిపి. మందు రాసిస్తే పావలా పుచ్చుకునేవాణ్ని. చుట్టుపక్కల ఊళ్లలోకి వెళ్లి పోలియో బారినపడ్డ వాళ్లని తీసుకొచ్చి ఉచితంగా వైద్యం, శస్త్రచికిత్సలు చేయించా. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌కి అధ్యక్షుడినయ్యాక నాకున్న పరిచయాలతో స్పెషలిస్టులను తీసుకొచ్చి పేదలకు శస్త్రచికిత్సలు చేయించేవాణ్ని. ఒకసారైతే డా.పంచమూర్తి అనే ఆయనతో రెండువందల మందికి గుండె ఆపరేషన్లు చేయించాను. ముప్ఫై ఏళ్లపాటు ఇలా సేవలందించాను.
సెక్సాలజీ ఆవశ్యకత గుర్తించి..
వైద్యవిద్య చదువుతున్నప్పుడు మా ప్రొఫెసర్‌ ఒక ఐఏఎస్‌ ఆఫీసరుని తీసుకొచ్చారు. ఆయనకు వీర్యం పోతోందని తెగ బాధ పడుతున్నారని చెప్పి మా ముందే సందేహ నివృత్తి చేశారు. మరోసారి నాన్న కొత్తగా పెళ్లైన కుర్రాడిని నా దగ్గరికి తీసుకొచ్చారు. తనకి హస్తప్రయోగం అలవాటు ఉండేదట. పెళ్లయ్యాక నేను సెక్స్‌కి పనికిరాను అని నవ వధువుతో చెప్పి, అతడి ఆస్తిని ఆమె పేరున రాసి బయటికెళ్లిపోయి సైకిల్‌ షాపు పెట్టుకున్నాడట. హస్తప్రయోగంతో సెక్స్‌లో బలహీనులు కారని ఆ అబ్బాయికి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించాను. తర్వాత వాళ్లు చక్కగా కాపురం చేసుకొని పిల్లల్ని కన్నారు. అప్పుడే నాకర్థమైంది మనదేశంలో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ ఆవశ్యకత ఎంతో ఉందని. దీంతోపాటు నా హేతువాద నేపథ్యమూ తోడైంది.
‘ఈనాడు’ అండతో
1974లో ఆల్‌ ఇండియా రేడియోలో ఓసారి ‘సెక్స్‌ గురించి అపోహలు’ అనే కార్యక్రమం చేశాను. హస్తప్రయోగం, అంగ పరిమాణం, వీర్యం, శృంగార సమస్యలపై మాట్లాడాను. తర్వాత పదివేల ఉత్తరాలు వచ్చాయట. మర్నాడే రామోజీరావు పిలిచి సెక్స్‌ సమస్యల పట్ల ఉన్న అపోహల్ని తొలగించేలా కార్యక్రమం చేద్దామన్నారు. ‘ఈనాడు’ పత్రిక మొదలైన మూడోరోజునే ‘సెక్స్‌ సైన్స్‌’ పేరుతో ఒక కాలమ్‌ ప్రారంభించాం. అప్పట్లో అదొక పెద్ద సంచలనం. తర్వాత నేను ఇతర పత్రికలు, మ్యాగజైన్లు, టీవీ షోల ద్వారా ప్రొఫెషనల్‌ సెక్సాలజిస్టుగా మారాను.
సినిమా హాళ్లు ఖాళీ
సెక్స్‌ అంటే బూతు కాదు.. అదొక సైన్స్‌. అన్నింటిలాగే ఇందులోనూ భయాలు, అపోహలు, తప్పుడు అభిప్రాయాలు ఉంటాయి. ఆ సందేహాల్ని తీర్చేలా సాధికారికంగా చెప్పగలిగితే వినడానికి, చెప్పింది ఆచరించడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. క్రమంగా శృంగార విద్య పట్ల అవగాహన పెరుగుతోంది. ఇందుకు ఒక ఉదాహరణ చెబుతాను. ఒక ఛానెళ్లో అప్పట్లో శనివారం అర్ధరాత్రి ఓ కార్యక్రమం చేసేవాణ్ని. జనం సమస్యలకు పరిష్కారాలు ఇవ్వడంతో పాటు రతి భంగిమలు, వాత్సాయన కామసూత్రాల గురించి చెప్పేవాణ్ని. దీనికి ఎంత పాపులారిటీ ఉండేదంటే శనివారం అర్ధరాత్రుళ్లు చాలా సినిమా హాళ్లు ఖాళీగా ఉండేవి. ఒక స్నేహితుడు నన్ను ప్రత్యక్షంగా తీసుకెళ్లి మరీ ఇది చూపించాడు.
తెలుసుకుంటూనే ఉంటా
‘సెక్స్‌ డాక్టర్‌’ అని నన్ను ఎవరూ అగౌరవంగా చూడరు. నిజానికి దీంతోనే గౌరవం పెరిగింది. ‘మేం చేయలేనిది సమరం చేస్తున్నార’ని నా వైద్య మిత్రులు అంటుంటారు. నాపై ఎంత గౌరవం అంటే.. తీవ్రమైన పోటీ ఉండే ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సెక్స్‌ ఎడ్యుకేషన్‌, ఎయిడ్స్‌పై నిరంతరం పుస్తకాలు చదువుతుంటా. పరిశోధన చేస్తుంటా. ప్రస్తుతం ఐఎంఏకి గెస్ట్‌లెక్చర్లు ఇస్తున్నా.  

కుటుంబ వైద్యుడి పాత్ర
పాశ్చాత్య దేశాల్లో వైద్యం ప్రైమరీ, సెకండరీ, స్పెషలిస్ట్‌ అని మూడు దశల్లో ఉంటుంది. చిన్నచిన్న సమస్యలు కుటుంబ వైద్యుడు తీర్చుతాడు. స్పెషలిస్ట్‌ స్థాయిలో క్లిష్టమైన గుండె, మెదడు, ఊపిరితిత్తుల్లాంటి రోగాల బారిన పడకుండా కాపాడతాడు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఫ్యామిలీ ఫిజీషియన్‌ రిఫర్‌ చేస్తేనే మూడోస్థాయికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడలా కాదు. చిన్నచిన్న సమస్యలకూ స్పెషలిస్ట్‌ వైద్యం చేసే కార్పొరేట్‌ ఆసుపత్రులకు పరుగెత్తుతున్నాం. దీంతో కార్పొరేట్‌ దోపిడీ ఎక్కువవుతోంది. ఈ పద్ధతిని సమూలంగా మార్చడానికి ఒక సమగ్రమైన హెల్త్‌ పాలసీ రూపొందించి ఐఎంఏ తరపున అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆరోగ్య మంత్రి గులాం నబీ ఆజాద్‌లను కలిసి మాట్లాడాను. ఆ ప్రయత్నం కార్యరూపం దాల్చలేదు.
ఒక్కపూటే భోజనం
నా వయసు 81 ఏళ్లు. ఇప్పటికీ రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తా. ఉదయం ఐదు గంటలకే నిద్రలేస్తా. మితంగా, శాకాహారం భుజిస్తా. పొద్దున అల్పాహారం, సాయంత్రం భోజనం. మిగతా రోజంతా తీరిక లేనంత బిజీ. రోజూ ఏదో ఒక మీటింగ్‌ ఉంటుంది. హేతువాద చర్చలు, రక్తదాన కార్యక్రమాలు, వైద్యం, టీవీ కార్యక్రమాలు, పత్రికలకు రాయడం.. ఇదీ నా దినచర్య.
మా ఇల్లు మినీ భారతదేశం 
మా కుటుంబంలో అన్ని కులాలు, మతాలు, రాష్ట్రాలకు చెందిన వ్యక్తులున్నారు. గాంధీ ప్రారంభించిన హరిజనోద్ధారణ కార్యక్రమ స్ఫూర్తితో పెద్దక్కయ్య మనోరమని ఒక సామాన్య హరిజన వ్యక్తికిచ్చి పెళ్లి చేయించారు నాన్న. మా దృష్టిలో మనుషులంతా సమానమే అని నిరూపించడానికి ఇలా చేశారు. ఈ వివాహానికి జవహర్‌లాల్‌ నెహ్రూ హాజరై ఆశీర్వదించారు.
చనిపోయేవాళ్లం అప్పట్లో బాణామతి, చేతబడిలాంటి మూఢనమ్మకాలు, మూఢాచారాలు ఎక్కువ. వీటిపై చైతన్య సదస్సులు నిర్వహించేవాణ్ని. అప్పటి మెదక్‌ జిల్లా ఎస్పీ రవీందర్‌రావు పిలుపుతో.. నాగరాజు అనే హిప్నాటిస్ట్‌తో కలిసి ఓసారి జిల్లా అంతటా తిరిగి ప్రచారం చేస్తున్నా. జోగిపేట ప్రాంతంలో కొందరు దేవుడ్ని అవమానిస్తున్నారంటూ మాపై దాడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోకపోతే మేం చనిపోయేవాళ్లమే. అయినా తర్వాత మా ప్రచారం ఆపలేదు.
నిషేధిస్తే ప్రయోజనం లేదు
అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక పోర్న్‌ సినిమాలు, శృంగార సాహిత్యం అందరి అరచేతుల్లో ఉంటోంది. వీటి కారణంగా అమ్మాయిలపై లైంగిక దాడులు, సెక్స్‌ సంబంధిత నేరాలు పెరిగిపోతున్నాయని అంతా భావిస్తున్నారు. ఇది అపోహే. జనాభా పెరుగుతోంది. దానికి తగ్గట్టే నేరాల సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వం పోర్న్‌ సైట్లను నిషేధించడం కాదు.. సామాన్య జనానికి సెక్స్‌ విద్య పట్ల అవగాహన కలిగించాలి. ఈ జ్ఞానం లేకపోవడం వల్లే జనం రెచ్చగొట్టే శృంగార సాహిత్యంవైపు మళ్లుతున్నారు.
Website: click here 
Telegram channel: click 

for more Updates do subscribe to the newsletter and also subscribe in youtube: Click here

Till then keep visiting our website 
Telegram channel: Join Here
Instagram: Click here 
Join in Facebook group: Click here
Like our page on Facebook: Click here
Subscribe our Youtube Channel: Click here

Leave a Reply

Your email address will not be published.

AllEscort